నామం | అంతరార్థము |
---|---|
స్వాస్యః ప్రాగ్వంశః వంశవర్ధనః |
స్వ ఆస్య - దాన్ని అదే కబళిస్తుంది. అన్నమూ అన్నాదుడూ అదే గనుక. దాని వంశమైన ఈ సంసార మతి పురాతనం. ఈ వంశాన్ని పెంచేదీ అదే (వర్ధన) మరలా త్రుంచేదీ (వర్ధన) అదే. |
భారభృత్ కథితః |
ఈ సమస్త భారమూ అదే వహిస్తున్నది. శబ్ద ప్రపంచమంతా చెప్పే (కథిత) ఏకైకమైన అర్థమది. |
యోగీ యోగీశః సర్వకామదః |
శబ్దరూపమైన సృష్టితో ఓతప్రోతమై ఉన్నదా అర్థం. అలా ఉండి కూడా దీని కీశం అతీతమైనది. ఈ రహస్యాన్ని గుర్తిస్తే మరి దేనిమీదా కామం లేకుండా (ద) ఖండించి వేసేది అదే. |
ఆశ్రమః శ్రమణః క్షామః |
ఖండించి సంసార శ్రమను పూర్తిగా రూపుమాపేది అదే. అందు కోసమే ఈ జీవుడు యావజ్జీవం శ్రమించవలసింది. అదీ ఎంతో (క్షమ) సహనంతో సాగించవలసి ఉంటుందా శ్రమ. |
సుపర్ణః వాయువాహనః |
అభ్యాస వైరాగ్యాలనే పర్ణాలు గల ఈ మనస్సునూ నిత్యమూ రాకపోకలు చేసే ఈ ప్రాణ వాయువునూ అందుకోసమే మనకు సాధనాలుగా ప్రసాదించాడా పరమాత్మ. |
ధనుర్థరః ధనుర్వేదః దండః దమయితా దమః |
మనః ప్రాణాలనే సూక్ష్మశరీరంతో స్థూలమైన ఈ ధనుస్సును (దేహాన్ని) ధరించాము మనం. మరలా ఈ ధనుస్సు ద్వారానే దాన్ని (వేద) అందుకోవలసి ఉంది. అలా అందుకోటానికి సహాయంగా (దండ) శాస్త్రాన్నీ (దమయితా) శాసకుడైన గురువునూ (దమ) దానికి తగిన శిక్షణనూ మనకు సమకూర్చాడు జీవితంలో. అలాంటి శిక్షణనందుకొంటే జీవితంలో పరాజయం కలగదు. |
అపరాజితః సర్వసహః |
అన్ని విఘ్నాలనూ ఎదిరించి నిలవగలడు. |
Page 59