నామం | అంతరార్థము |
---|---|
జ్ఞానముత్తమమ్ | జ్ఞానమే, దృశ్యరహితం గనుక ఆ జ్ఞానమెప్పుడూ ఉత్తమమే. అఖండమే. |
సువ్రతః సుముఖః సూక్ష్మః |
జ్ఞాన స్థితే వ్రతం దానికి. దాన్ని విడిచి ఉండదు. అదే ముఖం దానికి జ్ఞేయాన్ని దర్శించటానికి. జ్ఞానమే జ్ఞేయమయి ఈ జ్ఞేయాన్ని మరలా ఆ జ్ఞానమే దర్శిస్తున్నది. ఇదే అన్నింటికన్నా అతిసూక్ష్మమైన రహస్యం. |
సుఘోషః సుఖదః సుహృత్ |
ఈ రహస్యాన్ని ఆగమరూపంగా ఘోషిస్తూనే ఉన్నదది. దాని నర్థం చేసుకొని పట్టుకొనే సాధకుడికది సుఖదమే, సుహృత్తే. |
మనోహరః జితక్రోధః వీరబాహుః విదారణః |
సుహృత్తు గనుకనే మొదట సాధకుడి మనసును హరిస్తాడు. దానితో క్రోధమనేది తొలగిపోతుంది. క్రోధం రాగానికి కూడా ఉపలక్షణం గనుక రాగద్వేషాలు రెండూ పోతాయని భావం. తన్మూలంగా వీరబాహువయి విదారణ చేయగలడీ రజస్తమో గుణాలను. |
స్వాపనః స్వవశః వ్యాపీ |
స్వమ్ ఆపాదయతీతి స్వాపనః ఆవరణ విక్షేపరూపమైన ఆ రెండింటినీ విదారణ చేసి మన స్వరూపంలోనే నిలుపుతాడు మనలను. మన వశంలో ఉంటామప్పుడు మనం. లేదా ప్రపంచ వశంలో కాక పరమాత్మ వశంలో ఉంటాము. అదే వ్యాప్తి ఈ సాధకుడికి. జీవజగదీశ్వర భేదం నశిస్తేనే నిజమైన వ్యాప్తి. |
నైకాత్మా నైకకర్మకృత్ |
అలా వ్యాపిస్తే అన్ని దేహాలూ మనవే. ఆత్మ అంటే ఇక్కడ దేహమని అర్థం. అలాగే ఆ దేహాలతో చేసే అన్ని వ్యాపారాలూ మనవే. ఈశ్వర రూపంగా శరీరేంద్రియాదులన్నీ ఒక్కటే అయినప్పుడీ యజ్ఞయాగాదులెవరి కోసం. |
Page 38