నామం | అంతరార్థము |
---|---|
స్థవిష్ఠః అభూః |
అన్నిటికన్నా స్థూలమది. దానికన్నా స్థూలం అభూః - నభవతి లేదు. నిత్యసిద్ధమది. అభూః - క్రొత్తగా ఏర్పడేది కాదు. |
ధర్మయూపః మహామఖః నక్షత్రనేమిః నక్షత్రీ |
ధర్మాచరణతో దాన్ని సాధించాలని చూస్తారు. పెద్ద పెద్ద మఖాలు రాజసూయాదియాగాలు చేస్తారు. నక్షత్ర దానివల్ల క్షతం తొలగి పోయిందని భావిస్తారు. కాని వాటన్నింటికీ నేమి - కేంద్రస్థానమా పరమాత్మేనని ఎరగరు. దాన్ని భావిస్తేనే క్షతానికి దూరమవుతామని కూడా తెలియరు. |
క్షమః క్షామః సమీహనః |
అన్నీ క్షపితమైనా నిలిచి ఉండేదది. కనుకనే మనలను నిలపగలదు. అలా నిలపాలని ఈహ కోరిక నీకు జనిస్తే దానికీ నిన్ను నిలిపే సంకల్పం కలిగి తీరుతుంది. |
యజ్ఞః ఇజ్యః మహేజ్యశ్చ |
అది వదిలేసి చేస్తున్నాము మనం యజ్ఞయాగాదులను. ఈ చేసే యజ్ఞస్వరూపుడా విష్ణువేనని తెలియదు మనకు. యజ్ఞో వైవిష్ణుః - అంతేగాదు. యజ్ఞంచేత ఇజ్యుడు యజింపవలసిన వాడూ ఆయనే. దేవతలు గదా ఇజ్యులంటే వారికి కూడా ఇజ్యుడైన మహేజ్యుడాయన. |
క్రతుః సత్రమ్ సతాం గతిః |
యజ్ఞాలే గాదు, సయూపాలైన క్రతువులూ ఆయనే. అవి చేయాలనే (క్రతు) సంకల్పమూ ఆయనే. దీర్ఘసత్రయాగాలూ ఆయనే. వీటన్నింటి ద్వారా శిష్టులైన పెద్దలందుకొనే గమ్యమూ ఆయనే. |
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞః |
ఇంతెందుకు. సర్వమూ అయి సర్వాన్నీ దర్శిస్తున్నాడా ఈశ్వరుడు. దర్శి గనుకనే దృశ్యంలో చేరిపోడు. దాని నుంచి ఎప్పుడూ విముక్తుడే. దృశ్యమైన సర్వమూ అసలు దృక్కే. |
Page 37