నామం | అంతరార్థము |
---|---|
అతీంద్రియః మహామాయః మహోత్సాహః మహాబలః |
మధువులాంటి ఆ అమృతత్త్వాన్ని అందుకొంటే ఈశ్వరుడిలాగా ఈజీవుడూ అతీంద్రియుడవుతాడు. మాయకధీనుడు కాక అధీశుడవుతాడు. గొప్ప ఉత్సాహాన్ని బలాన్నీ పుంజుకుంటాడు. |
మహాబుద్ధిః మహావీర్యః మహాశక్తిః మహాద్యుతిః |
అంతేకాదు, పరిపూర్ణమైన బుద్ధి లేదా జ్ఞానం - సమగ్రమైన వీర్యం. సమగ్రమైన శక్తి అలవడతాయి. అంతరమైనది వీర్యమయితే బాహిరమైనది శక్తి. వీటితోపాటు అద్భుతమైన ద్యుతి అంటే తేజస్సు కూడా లభిస్తుంది. ఇవన్నీ షాడ్గుణ్యం క్రిందికి వస్తాయి. ఈశ్వరుడిలో ఉన్న ఈ గుణాలే జీవుడికీ సంక్రమిస్తాయి. |
అనిర్దేశ్యవపుః శ్రీమాన్ |
నిర్దేశించటమంటే చూపటం. వపువంటే శరీరం. ఫలానా అని చూపటానికి లేదా విగ్రహం, గుణాత్మకం కాదది. శ్రీ అంటే శక్తిరూపంగా అమూర్తమై ఉందా తత్త్వంలో. శ్రీమంతమైన ఆతత్త్వం నిరాకారం. |
అమేయాత్మా మహాద్రి ధృక్ |
కనుకనే అది జీవుడి విగ్రహంలాగా మేయం కాదు. కొలమానాని కందదు. అమేయమైన చైతన్యం. నేననే భావంతో ఉన్న ఆత్మ స్వరూపం. అద్రి ఎప్పుడూ ద్రవించని చలించని అయినా చలించి అన్నింటినీ కబళించే మాయాశక్తి చేత ధృక్ అప్రధృష్యమది. |
మహేష్వాసః మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః |
ఇష్వాసమంటే బాణాసనం. ధనుస్సు, గొప్ప బాణాసనమా మాయాశక్తి. అది విసరిన ఒక బాణమే ఈ భూతత్త్వం, మహి. ఈమహిని అది మరలా భరించే ఉన్నది. శ్రీనివాస. శ్రీలోనే నివసిస్తున్నదీ భూ. అవ్యక్తమైతే శ్రీ. వ్యక్తమైతే భూ, ఇది గుర్తించిన వివేకవంతులే సంతః - వారికి గతిః గమ్యమదే. |
Page 21