
విప్లవం. ఈ క్లేశాలన్నీ అనుభవించి రోత పుట్టిన మానవజాతి తన దౌర్బల్యాన్ని తాను గుర్తించి బాగుపడే అవకాశం సృష్టిలో లేకపోదు. అది సహజ వైరాగ్యం వల్ల కొంతా, పరిస్థితులవల్ల కొంతా కలిగితే అదే దైవికమైన ప్రబోధన. అది ఏదో ఒకరీతిలో మనలో పాదుకొన్న దుష్టభావాలను ఖండించి మనలోనే అట్టడుగున పడిపోయిన శిష్టగుణాలను పైకి లాగుతుంది. దైవికమైన ఒక అతీంద్రియ శక్తి మనలో అవతరిస్తేనే గాని ఆ బలంతో మనకీ రెండూ అలవడవు. కాబట్టి అదే భగవదవతారమనుకొన్నా అనుకోవచ్చు. మత్స్యకూర్మాదులని వర్ణించింది కూడా ఇలాటి అభిప్రాయంతోనే అని ఇంతకుముందే వాటి అంతరార్థం వివరించి ఉన్నాము. పోతే అలాటి శిష్ట మానవకోటి బ్రతికే కాలమే కృతయుగమనకోండి. తప్పేముందు. కాబట్టి ఆధిభౌతికంగా జరిగినట్టు పురాణం వర్ణించే ఈ వ్యవహారమంతా ఆధ్యాత్మికంగా సమన్వయించుకొన్నా సమన్వయించుకోవచ్చు మనం. ఎలాగైనా చెల్లే వ్యవహారమే
ఇంతకూ పురాణహృదయమేదో అది గ్రహించాలి మనం. మన మీనాడు కలికాలమను, మరొక కాలమను, చావు బ్రతుకుల సంధిలో ఉన్నాము. సతమత మవుతున్నాము. దృష్టమైన ప్రపంచాన్నే నమ్మి అదృష్టమైన ఈశ్వర తత్త్వాన్ని పూర్తిగా మరచిపోయాము. ఈ దృష్టానికా అదృష్టమే మూలాధారమనే విషయమే మనసుకు రావటం లేదు మానవుడికి. దానితో సత్యం మరుగయింది. సత్యం కాని ప్రపంచమే మెరుగయింది. సత్యం కాదు గనుకనే ఇది మనమెంత గట్టిగా పట్టుకొన్నా నిలవకుండా జారిపోతున్నది విప్లవాలకూ, విషాదాలకూ గురి చేస్తున్నది. చివరకు నట్టేటిలో ముంచుతున్నది. అటు సత్యానికి దూరమై ఇటు సత్యమని నమ్మిన సంసారానికీ భారమై మానవుడిప్పుడు భగవద్గీత చెప్పిన “నాయమ్ లోకోస్తి నపరో” అన్నట్టు బ్రతుకుతున్నాడు జీవచ్ఛవం మాదిరి. ఇలాటి హీనమైన బ్రతుకుకు స్వస్తి చెప్పి మరలా పరిపూర్ణ మానవుడిలాగా బ్రతకాలంటే పరీక్షిత్తులాగా దీనినుంచి మోక్షం సంపాదించాలి మనం. దానికోసం శౌనకాదులలాగా శ్రవణం చేయాలి. ఏమిటా శ్రవణం. భాగవత సత్యం. భాగవత సత్యాన్ని శ్రవణం చేసి, మననం చేసి, దానిని నిరంతరమూ ధ్యానిస్తూ, జీవితాలు గడపటమే మనమవలంబించవలసిన భాగవత
Page 408
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు