
అప్పటినుంచే ప్రజలందరూ శుద్ధ సత్త్వసంపన్నులై మనుగడ సాగిస్తారు. ధర్మదేవత మరలా నాలుగు పాదాలతో నడుస్తుంది.
నిజంగానే ఇలా జరుగుతుందా లేక ఇదంతా పురాణర్షి చేస్తున్న ఊహాగానమా, అని ఈనాటి హేతువాది సందేహించవచ్చు. పైగా దశావతారాలని మాటేగాని మనమిప్పటికి మనకన్నులతో ఏ అవతారమూ చూడలేదు. మనం చూడకుండానే తొమ్మిది అవతారాలు జరిగిపోయినాయి. పదియవదైన ఆ కల్క్యవతారమా ఇంకా రాలేదు. ఈ మధ్య కాలంలో బ్రతుకుతున్నాము మనం. అందుకే మనకీ కథలు వింటుంటే ఎక్కడ లేని అనుమానం. అయితే ఒక్కమాట. మన అనుభవానికి రానంత మాత్రాన ఏదీ కొట్టివేయరాదు. అలా కొట్టివేస్తాడీ నాటి మానవుడు. అది సత్యాన్వేషి అయిన శాస్త్రజ్ఞుడి లక్షణంకాదు. ఎందుకంటే సృష్టిలో ఎంత ఉందో ఏముందో అంతా మన అవగాహనకు వచ్చే వ్యవహారం కాదు. మన ఆకళింతకు వచ్చేది సముద్రంలో ఒక బిందువు. ఈ బిందువు నాధారం చేసుకొనే ఆ మహాసముద్రం తాలూకు అస్తిత్వాన్నీ సామర్ధ్యాన్నీ మన మూహించుకోవాలి. అది ఊహ అయినా ఈ అనుభవాన్ని బట్టి చేసింది కాబట్టి ఇదెంత గట్టో అదీ అంత గట్టిదేనని అర్ధం చేసుకోవాలి మనం. అలా చేసుకోమనే ఏ శాస్త్రమైనా మనకు చెప్పే సత్యం. మరి శాస్త్రానికి శాస్త్రమైన అధ్యాత్మ రంగాన్ని మనం కాదని కొట్టివేయటం దేనికి. ఇది సత్యమైతే అది వీటికన్నా సత్యం. దేశకాలపాత్రావస్థా వైచిత్ర్యాన్ని ఆధారం చేసుకొనే అది ఈ రహస్యాలను వక్కాణిస్తున్నది. కాకపోయినా చేతనా చేతనాత్మకమైన ఈ విశ్వమంతా పరస్పర సాపేక్షంగా Relative కనిపిస్తున్నదంటే దీనికంతటికీ ఒక నిరపేక్షమైన తత్త్వం Absolute మూలభూతమైనది లేకుంటే ఎలా సాధ్యం. ఉంటే అది సర్వజ్ఞమూ సర్వశక్తి సమన్వితమూ కాక తప్పదు. అది తాను సృష్టించిన ఈ ప్రపంచ సృష్టి స్థితిలయాలు యథాకాలంగా చేయకా తప్పదు. అందులో దీని స్థితికి ధర్మం మూలమైతే లయానికి ధర్మవిప్లవం హేతువు. అది నివారించి మరలా విశ్వస్థితిని కాపాడే బాధ్యత ఆ ఈశ్వరుడు తన చేతన సృష్టిలో విశిష్టమైన జాతి కొప్పగిస్తాడు. వారే మానవులు. వారిది ఎప్పుడు విస్మరిస్తారో అప్పుడిక తానే దానిని చక్కదిద్దాలి. దిద్దాలంటే తానెక్కడో అమూర్తంగా అజ్ఞాతంగా ఉండిపోతే లాభంలేదు. ఏదో ఒక ఆకృతిలో మూర్తీభవించి నలుగురిలో దృశ్యమానుడై ఆ గురుతర బాధ్యత తానే
Page 407
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు