
అయితే ఇంతకు ముందు వచ్చిన అవతారాలు తొమ్మిది పోగా ఇక వచ్చేది పదియవది కల్క్యవతారం. కలికి కావలసినది కల్క్యవతారమే. ఇది ఇక విలక్షణమైన రూపం. మత్స్యకూర్మాదుల లాంటిది గాదిది. రామకృష్ణాదుల వంటిది కూడా కాదు. ఆనాటి పరిస్థితులకు సరిపోయినా యవి. ఇప్పటి స్థితి అలా కాదు. మానవుడిప్పుడు బాగా తెలివి మీరిపోయాడు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వెట్టివెణ్ణి వేషాలు వేస్తున్నాడు. ఆటంబాంబులు లేసరు కిరణాలు కనిపెట్టాడు. అంతరిక్షంలో రాకట్లలో కూచుని వీరవిహారం చేస్తున్నాడు. నక్షత్రయుద్ధాలు సాగిస్తానంటున్నాడు. లేసరు కిరణాల మూలంగా నిమిషంలో ఈ సృష్టినంతా నిర్మూలం చేస్తానని బెదిరిస్తున్నాడు.
మరి ఇలాటి బెదరింపులకు జవాబు చెప్పే అవతారమెలా ఉండాలి. తాడి తంతే తలదన్నాడన్నట్టు దీనిని మించి పోవాలది. అలాగే వర్ణించింది భాగవతం. ఏమని
శంబల గ్రామముఖ్యస్య - బ్రాహ్మణస్య మహాత్మనః
భవనే విష్ణు యశసః - కల్కిః ప్రాదుర్భవిష్యతి
శంబళమని ఒక గ్రామమట. అది ఈనాటి సంబళపూరు కాదు గదా. అక్కడ విష్ణుయశుడనే బ్రాహ్మణుడట. అంటే ఒక భాగవతోత్తముడైన మహనీయుడు. అలాటి ఉత్తమాధికారిని నిమిత్తంగా చేసుకొని అవతరిస్తాడట కల్కి అతడి గర్భవాసంలో జన్మిస్తాడని కూడా లేదు. అతని భవనంలో నని ఉంది. దీనిని బట్టి అయోనిజుడయి అవతరించవచ్చు. అంతేకాదు. జన్మించగానే
అశ్వమాశుగ మారుహ్య దేవదత్తం జగత్పతిః
అసినా 2 సాధు దమన - మష్టశ్వర్య గుణాన్వితః
విచరన్నాశునా క్షోణ్యాం - హయేనా 2 ప్రతిమద్యుతిః
నృపలింగచ్ఛదో దస్యూన్ - కోదేవో నిహ నిష్యతి
అతి శీఘ్ర గమనమైన ఒక అశ్వాన్ని ఆరోహిస్తాడట. అప్పటికి సద్యోజాతుడే గాక సద్యోయౌవనుడు కూడా అయి ఉండాలా మహాత్ముడు. అలా అయితేగాని అశ్వాన్ని వెంటనే ఆరోహించలేడు. అశ్వమంటే ఇది మామూలు గుఱ్ఱం కాదు. మామూలు గుఱ్ఱమది ఎప్పటికి జవాబు చెప్పాలీ లేసరు కిరణాలకు ?
Page 404
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు