#


Index

  ఈ ఆరోపణకే అధ్యాస (Super Imposition) మని పేరు. ఇది కేవలమజ్ఞాన కల్పితమే. కాబట్టి జ్ఞానదృష్టితో చూస్తేలేదు. ఇలా లేదని భావించటమే హానం. పరమేశ్వర సంకల్పమన్నారు గదా, లేదని ఎలా భావించటమని సందేహించరాదు. ఆ సంకల్పం కూడా ఒక ఆధ్యాసే పొమ్మన్నారు స్వామివారు. ఎంచేతనంటే సంకల్పమనేది కూడా ఈశ్వర చైతన్యమేగాని అంతకన్నా వ్యతిరిక్తమయిన తత్త్వం కాదు' వ్యతిరిక్తమయితే అది అనాత్మ అవుతుంది. అనాత్మకు స్వతహాగా అస్తిత్వం లేదు. ఆత్మరూపంగానే దానికి ఉనికి. అంతెందుకు? ఒక తరంగాన్నే తీసుకొని చూడు. తరంగమనేది జలవికారమే. జలమే పొంగి పోగై అలా భాసిస్తున్నది. జలంకన్నా విలక్షణం కాదది. దానితో అవినాభూతమే, జలంగానే అది సత్యంగాని తరంగ రూపంగా సత్యంకాదు. కేవలమూ జలంమీద జరిగిన ఒక అధ్యాసే అది. అలాగే ఈశ్వర సంకల్పం కూడా తదీయ చైతన్య సాగరంలో పొటమరించి పైకి వచ్చిన ఒక తరంగమేనని పేర్కొన్నాము. అంచేత అది చైతన్య రసాత్మకమే గాని అంతకన్నా వేరుగాదు.

  అంతేకాదు పరమాత్మకు ఒక సంకల్పమంటూ వాస్తవంగా ఏర్పడలేదు. జీవుడు తన అజ్ఞాన దృష్ట్యా ఆయనకొక సంకల్పాన్ని అంటగట్టాడు. అది ఎలాగని అడగవచ్చు. జీవుడికీ ప్రపంచం నిత్యమూ అనుభవానికి వస్తున్నది. అసలు సృష్టి కాకుంటే అనుభవానికి ఎలా రాగలదు? కాబట్టి సృష్టి అయి తీరాలి. అయితే ఆ సృష్టించిన వాడెవడు. జీవుడేనా? జీవుడల్పజ్ఞుడు, అల్పశక్తి సంపన్నుడు. ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించే స్తోమత లేదు. పోతే ఇక ఉన్నదెవరు? సర్వజ్ఞుడైన పరమాత్మ ఒక్కడే. కాబట్టి పరిశేషన్యాయంగా ఆయనే కర్త అని భావిస్తున్నా మీ ప్రపంచానికి. అది మన భావనేకాని నిజానికాయనకొక సంకల్పమూ లేదు. సృష్టి లేదు. అంతా మన అజ్ఞాన కల్పితమే.

  దీనిని బట్టి భౌతిక జగత్తు మాదిరి శాస్త్ర జగత్తుకూడా వాస్తవం కాదని తేలిపోయింది. శాస్త్రమనేది ఈశ్వర సంకల్పమని చెప్పినా ఆ సంకల్పం కూడా అధ్యాస మూలకమే.

  కాబట్టి దానికి అస్తిత్వంలేదు. అధ్యాస నొప్పుకున్నంత వరకే దానికి స్థితి. అధ్యాసనే హానం చేశామంటే ఆ సంకల్పమే ఎగిరిపోతుంది. సంకల్పమే లేకపోతే తన్మూలమయిన శ్రుతి స్మృతి పురాణేతిహాసరూపమయిన వాఙ్మయమెప్పుడో ఎగిరిపోతుంది.

Page 23