#


Index

  శక్తిరూపంగా ఉన్న వాక్కే వ్యక్తమయితే దాన్ని వైఖరి అంటున్నాము. వైఖరి ఎప్పుడయిందో అప్పుడే నామరూపాదులన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి వాచ్యమయిన నామరూపాలకంటే వాచకమయినశబ్దమే పూర్వసిద్ధమని గ్రహించాలి మనం. ఎంచేతనంటే శబ్దశక్తి ప్రకాశింపజేస్తుంటేనే నామరూపాది ప్రపంచమంతా ప్రకాశిస్తున్నది. ఆ శక్తి వివర్తమే ప్రస్తుతం మనకు గ్రంథరూపంగా కనిపించే ఈ ఋగాది శాస్త్రమంతా. పరారూపంగా అది నిత్యమే కాబట్టి తద్వివర్తమయిన ఇదీ నిత్యమే. నిత్యం గనుకనే నిత్యమయిన జీవిత సత్యాలనే అది మనకు నిరూపిస్తున్నది.

  అంచేత నామరూపాత్మకమయిన భౌతిక జగత్తు నొకవేళ కాదని త్రోసిపుచ్చినా తత్ప్రకాశకమయిన శబ్ద జగత్తు అంతకు పూర్వమే సిద్దమయి ఉంది. కాబట్టి అది పారమేశ్వరమయిన సంకల్పమే కాబట్టీ, దానినలా నిరాకరించటానికి లేదేమోనని ఆశంక కలగవచ్చు. అలా కూడా శంకించనక్కరలేదన్నారు భగవత్పాదులు. ఆయన ఈ భౌతిక జగత్తులాగా శాస్త్రజగత్తును కూడా త్రోసి పుచ్చారు. శాస్త్రమే లేదని నిషేధించారంటే ఇక ఆ శాస్త్రం విధించే వర్ణాశ్రమాది ధర్మాలకసలు ప్రసక్తే లేదు. ఏదైనా నిమిత్తాన్ని బట్టి నైమిత్తికం. నిమిత్తమే లేకుంటే ఇక నైమిత్తిక మెక్కడిది? కనుకనే, “నవర్ణాః” బ్రాహ్మణాది వర్ణాలూలేవు. “నవర్ణా శ్రమాచారధర్మాః” వర్ణాశ్రమాలులాగానే వాటికి సంబంధించిన ధర్మాలుగానీ, ఆచారాలుగానీ ఏవీ లేవు. అంతేకాదు. “న మే ధారణాధ్యానయోగదయోపి" ఆత్మసాధనకు తోడుపడే ధారణాధ్యాన సమాధులు కూడా నిజంలో లేవు. అంతా అభావమే. దీనితో శ్రుతులలో ప్రతిపాదించిన కర్మకాండా జ్ఞానకాండా రెండూ బలాదూరయినాయి.

  అదేమిటి ? నిత్యసిద్ధమని గదా చెప్పారు శబ్దమంటే. ఆ శబ్ద వివర్తమయిన ఋగాది శాస్త్రమెలా అబద్దమయింది. శాస్త్రం ప్రతిపాదించిన వర్ణాశ్రమాది ధర్మాలెలా అభావమవుతాయని మరలా ప్రశ్న వస్తుంది. దీనికే "అనాత్మాశ్రయాహమ్మమాధ్యాస హానాత్" అని హేతువును నిరూపించారు భగవత్పాదులు. ఆత్మాశ్రయం కానిదేదో అది అనాత్మాశ్రయం. వర్ణాశ్రమాది ధర్మాలుగానీ, ధారణాధ్యానాదులు గానీ ఇవి ఆత్మకు చెందినవి కావు. ఆత్మ అనేది శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. నిరంజనం. దానికెలాంటి గుణంగానీ అంటదు. నీవెన్ని గుణాలు చెప్పినా అవన్నీ అనాత్మ ప్రపంచానివే. వాటినే మన అజ్ఞానంచేత శుద్దమయిన ఆత్మచైతన్యాని కారోపిస్తున్నాము

Page 22