అది అనుభవమే కాదంటావా, కాకపోతే తెల్లవారిన తరువాత రాత్రి సుఖంగా నిద్రపోయాను- నాకేమీ తెలియలేదని వర్ణిస్తున్నావు. సుఖమనే దొకటి - అజ్ఞానమనేదొకటి అనుభవించకనేపోతే దానినెలా స్మరించగలిగావు ? స్మృతి అనేదెప్పుడూ అనుభవంమీదనే ఆధారపడి ఉంటుంది. (అనుభవం లేకపోతే ఏర్పడదు). అలాంటప్పుడా అనుభవించిన వాడెవడు ? ఎవడూ లేడంటే అనుభవానికి అర్ధమేలేదు. సుఖం సుఖాన్నే అనుభవించలేదుగదా. దాన్ని అనుభవించేందుకొక అనుభవిత ఉండి తీరాలి. అది ఎప్పుడూ చేతనమే కావాలిగాని అచేతనం కావటానికి వీలులేదు. అందుచేత చైతన్యరూపమైన ఆత్మ తప్పకుండా సుషుప్తిలో ఉండి తీరాలి. ఏ సుషుప్తిలో లేదని వాదిస్తున్నావో ఆ సుషుప్తిలోనే ఉండాలది. తప్పదు. ప్రపంచం లేదుగదా అంచేత అది కూడా లేదని వాదించరాదు. ప్రపంచంలేదు గనుకనే అది ఉండాలని మా వాదం. లేకుంటే ప్రపంచం లేదని చెప్పటానికి కూడా ప్రమాణం లేకపోతుంది. భావానికెలా సాక్షి కావాలో అభావానికి కూడా అలాగే కావాలి. అలా కాకుంటే ఆ అభావం అసాక్షికమయి లేకపోవలసి వస్తుంది. అభావం లేదంటే ఏమిటర్ధం? భావమనేది ఉందనే గదా. భావమే ఆత్మ చైతన్యం. అందుచేత ఎంత లేదనుకొన్నా అది ఉండి తీరుతుంది. అయితే ఉన్నా కనపడటంలేదే అని సందేహం. దానికి కారణమనాది ప్రవృత్తమైన అవిద్య అని ఇంతకుముందే పేర్కొన్నాము. అవిద్య నిర్మూలమైతే అది తప్పకుండా అనుభవానికి వస్తుంది. అవిద్యకు విరుగుడు విద్యే. విద్య అంటే ఏమిటి? అంతా ఆత్మ చైతన్యమేనని గుర్తు చేసుకోవటం. చేసుకొంటే పాంచభౌతికమైన ఈ ప్రపంచాని కసలస్తిత్వమే లేదు.
శ్లోకం 2
న వర్ణా న వర్ణాశ్రమాచార ధర్మా
నమే ధారణా ధ్యాన యోగాదయో2పి |
అనాత్మాశ్రయాహంమమాధ్యాసహానాత్
తదేకో 2 వశిష్టః శివః కేవలో 2 హమ్ ॥
బాహ్యాంతర రూపమైన భౌతిక ప్రపంచమంతా లేదని నిరూపణ అయింది. పోతే ఇక శాస్త్ర ప్రపంచమొకటి ఉందిగదా. దాని సంగతేమిటని ప్రశ్న వస్తుంది. అదేమిటి. భౌతికమన్నప్పుడు శాస్త్రంకూడా దానితోనే గతార్ధమవుతుంది గదా అని శంకించరాదు.
Page 20