మిగతావన్నీ ప్రమాణాలననుసరించి సిద్ధిస్తే అది ఏ ప్రమాణమూ అక్కరలేకుండానే సిద్ధిస్తుంది. మీదు మిక్కిలి దానివల్లనే ప్రత్యక్షాది ప్రమాణాలన్నీ ఏర్పడుతున్నాయి. స్వతః ప్రమాణమది. స్వతః ప్రమాణం గనుకనే అహంకారం మొదలుకొని ఆకాశందాకా ఉన్న పదార్ధజాతానికంతా అది మూలకారణమైంది. అన్నింటికి మూలమెప్పుడయిందో అప్పుడిక దానికి మార్పులేదు. మారితే అది మూలమే కాదు. మారటమనేది దాని విషయంలో అసలు సంభవం కూడా గాదు. కారణమేమంటే అది నిత్య చైతన్య స్వరూపం. నేను అనే సుర్పణమే అది. ఆ స్ఫురణనువిడిచి అది ఎప్పుడూ ఉండదు. అదే దాని స్వరూపం. మరొక రూపమే లేదు దానికి, అంచేత మారటాని కసలవకాశమే లేదు. తాను మారకుండా మారే పదార్థాలనన్నింటినీ కనిపెట్టి చూచే తత్త్వమది. అలాంటప్పుడది ఎలా మారగలదు? అదీ మారితే దాని మార్పును కనిపెట్టేది మరొకటి కావాలి. అది మరలా అనవస్థా దోషానికి దారి తీస్తుంది. కాబట్టి ఆత్మచైతన్యమొక్కటే ఐకాంతికం. మిగతా అనాత్మ ప్రపంచమంతా అనైకాంతికమే.
ఆత్మ మాత్రమైకాంతికమెలా అయింది. ఐకాంతికమే అయితే అది అన్నివేళలా మనకు కనపడాలి గదా. మరి సుషుప్తిలో అది ఏ మాత్రమూ కనపడటంలేదే అని మరలా ఎదురు ప్రశ్న వేశారు. దీనికి భగవత్పాదులు సమాధానం చెబుతూ సుషుప్తినే దృష్టాంతంగా తీసుకొన్నారు. ఏ సుషుప్తిలో లేదని వాదిస్తున్నారో ప్రతిపక్షులా సుషుప్తిలోనే ఉన్నదాత్మ. “సుషుప్త్యేక సిద్ధః” సుషుప్తిలోనే అది సిద్ధం. సుషుప్తిలోనే అంటే జాగ్రదాదిదశలలో లేదనా అర్ధం? కాదు. జాగ్రదాదులలో కూడా ఉంది. అయితే అప్పుడాత్మే గాక అనాత్మ జగత్తుకూడా కనిపిస్తున్నది. అలా రెండూ కనపడటం మూలాన అనాత్మ ఉన్నప్పుడే ఆత్మ ఉంది గాని, స్వతంత్రంగా లేదేమోననే భ్రాంతి కలగవచ్చు. సుషుప్తిదశలో అయితే ఇలాంటి భ్రాంతి కవకాశం లేదు. ఆ దశలో ప్రపంచ వాసనేలేదు కాబట్టి ఉన్నదిక ఒకే ఒక ఆత్మతత్త్వమని మనకు సులభంగా దాఖలా అవుతుంది. అందుకే సుషుప్తినే నిదర్శనంగా భావిస్తున్నారు భగవత్పాదులు.
అయితే సుషుప్తిలో ఉన్నట్టు మనకు దాని జాడ ఎక్కడా అంతుపట్టదే. పైగా అనాత్మ ప్రపంచంతోపాటు ఆత్మకూడా లోపించినట్టు కనిపిస్తున్నదే అని పూర్వపక్షం చేయవచ్చు. అదుగో కనిపిస్తున్నదంటున్నావే ఆ కనిపించేదెవరికి ? అని ప్రశ్న వేశారు భగవత్పాదులు. ఆత్మే లేదంటున్నావు సుషుప్తిలో, లేకుంటే ఆ సుషుప్తి దశ ననుభవిస్తున్నదెవరు?
Page 19