#


Index

  ప్రతిఒక్కటీ ప్రపంచంలో స్వతస్సిద్ధం కాదు. ఏదో ఒక మూలపదార్ధం నుంచి ఏర్పడిందే. అలా ఏర్పడిందంటే అది కార్యం. కార్యమనేసరికి దానికాది ఒకటీ అంతమొకటీ ఉండక తప్పదు. అంటే జన్మ, వినాశమూ అని అర్ధం. జన్మించిందంటే అంతకు ముందేమిటది ? ఎలా ఉంది ? ఈ కనిపించే రూపంలో లేదది. అలాగే నశించిన తరువాత కూడా ఈ రూపంలో కానరాదు. ఉదాహరణకొక ఘటాన్నే తీసుకొని చూడు. కుమ్మరి తయారుచేయక ముందది ఎక్కడిది? అప్పుడున్నది మృత్తికే గాని ఘటంకాదు. అలాగే అది బ్రద్దలైన తరువాత కూడా ఉన్నదక్కడ మృత్తికే, ఘటం లేదు. కాబట్టి ఇప్పుడు మనకండ్లకు ఘటంగా కనిపించే పదార్ధం ఈ రూపంలో ఆ రెండు దశలలోనూ లేదని అర్ధమయింది. అంటే ఆ రూపానికి నిలకడలేదనే గదా అర్థం.

  అయితే ఆద్యంతాలలో స్వరూప వ్యభిచారముంటే ఉండవచ్చు. కాని మధ్య కాలంలో దాని రూపమలాగే మారకుండా కనిపిస్తున్నది గదా అని సందేహం. 'ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి త త్తథా' అన్నారు అద్వైత సార్వభౌములైన గౌడపాదాచార్యులు. ఆదిలో, అంతంలో ఏది లేదో అది వర్తమానంలో కూడా ఉండటానికి వీలులేదు. ఉంటే ఆద్యంతాలలో కూడా నిరభ్యంతరంగా ఉండేది. అలా లేదు గనుకనే అది మధ్యకాలంలో కూడా లేదు పొమ్మన్నారాయన. అయితే ఉన్నట్టు మనం చూస్తున్నామే అని అడిగితే అది కేవలం మన భ్రమ అన్నారు. భగవత్పాదులు. మనమున్నట్లు చూస్తున్నది నిజంలో అక్కడ లేదు. ఫలానా అని దాన్ని పట్టుకొనే సరికే అది తప్పించుకొని పారిపోతుంది. ఇంతెందుకు, ఒక ఘటాన్నే తీసుకొని చూడు. దూరానికొక గుండ్రని ఆకారంలో మనకది గోచరిస్తున్నది. అలా గోచరించటం కేవల మాపాతరమణీయమే. దగ్గరికి వెళ్ళి చూడబోతే అదంతా మృత్తికేగాని కుండగాదు. అంటే కుండ అనే రూపం తప్పించుకొని పారిపోయింది. దాని స్థానంలో ఉన్నదప్పుడేమిటి? మృత్తిక అనే మూలపదార్ధమే. పోనీ అదైనా నిలకడగా ఉన్నదా అంటే లేదు. దాన్ని తడవిచూస్తే అదంతా కేవలం పృథివీరేణువులే. ఆ రేణువుల పరస్పర సంశ్లేషం వల్లనే అది ఒక మృత్పిండ రూపంలో కనిపిస్తున్నది. ఆ రేణువులైనా అక్కడికి నిలుస్తాయా అని చూస్తే ఘనంగా కనపడే ఆ అణువు లొకానొకప్పుడు ద్రవరూపంగా ఉన్న జలపరమాణువులే.

Page 17