#


Index

  అది కేవలమొక వ్యవహారం మాత్రమే. నిజానికి కాసులదండ అనే నామమూలేదు. రూపమూలేదు. కేవలమూ బంగారమనే ద్రవ్యమే ఆయా రూపాలలో మనకు దర్శనమిస్తున్నది. అంటే కారణమే కార్యరూపంగా భాసిస్తున్నదన్న మాట.

  ప్రస్తుత మీ జగత్తుయొక్క పరిస్థితికూడా ఇంతే. ఇదీ ఒక కాసుల దండమాదిరి కార్యమే. దీనికి మూలకారణము ఆ అఖండమైన ఆత్మ చైతన్యం, చైతన్యమనేది సూర్యరశ్మిలాగా వ్యాపించి ఉంటేనే పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఇందులో ప్రతి ఒక్క అణువూ మనకు భాసిస్తున్నది. అది లేకుంటే ఇది అంధకార బంధురమే. కాబట్టి అన్వయ వ్యతిరేకాలను బట్టి చూస్తే ఆత్మ చైతన్యంకంటే విలక్షణంగా ప్రపంచంలో ఏ ఒక్క అంశమూ లేదు. అంతా యధార్థంలో ఆత్మచైతన్యమే. ఆత్మే అనాత్మలాగా భాసిస్తున్నదంటే అది కేవలం మన అజ్ఞాన కల్పితమే. కాబట్టి దాన్ని లేదని నిషేధించటమే మన కర్తవ్యం. నిషేధిస్తే రజ్జుసర్పం మాదిరే అది కూడా పూర్తిగా తొలగిపోయి కేవలం చైతన్యమొక్కటే శేషిస్తుంది.

  అయితే నిషేధించాలనే మాట బాగానే ఉంది. కాని ఆ నిషేధించటం మాత్రమెలా సాధ్యమని మరలా ప్రశ్నవస్తుంది. ఎంచేతనంటే అధిష్ఠాన జ్ఞానమనేది లేకుండా ఆరోపితమెప్పుడూ తొలిగిపోదు. రజ్జువనేది సర్పంలాగా కనిపించిందంటే రజ్జు వధిష్ఠానం. సర్పమనేది దానిమీద ఆరోపితమయిన పదార్థం. ఇప్పుడీ ఆరోపితమెలా కనిపించగలిగింది మనకు? దాని అధిష్ఠానమయిన రజ్జువు ఫలానా అని గుర్తించకపోవటం వల్ల. ఈ గుర్తించక పోవటానికే అజ్ఞానమని పేరు. అధిష్ఠానం తాలూకు ఈ అజ్ఞానంవల్లనే ఆరోపితమైన మరొక రూపంగా మనకు భాసిస్తున్నది. మరలా ఆ అధిష్ఠాన మిదమితమనే జ్ఞానం మనకు కలిగితే చాలు. అజ్ఞాన మెగిరిపోతుంది. అజ్ఞానం పోయిందంటే తన్నిమిత్తమైన ఆరోపితం కూడా దానితోనే రూపుమాసిపోతుంది. అంచేత ఇది లేదని ఊరక నిషేధించి ప్రయోజనం లేదు. అధిష్ఠానమేదో దాని జ్ఞానం మొదట ఆర్జించి తద్వారా దీన్ని నిషేధించాలి. ప్రస్తుత మీ చరాచర ప్రపంచానికంతటికీ అధిష్ఠానం ఆత్మచైతన్యమేనని పేర్కొన్నారు. కాబట్టి ఆ ఆత్మ అనేది ఏమిటో మొదట అన్వేషణ చేసి పట్టుకోవాలి మనం. తరువాత దాని బలంతో ఈ అనాత్మ ప్రపంచాన్నంతా నిషేధిస్తూ పోవాలి. ఇంతకూ ఆ ఆత్మ ఏమిటి? దానినెలా అన్వేషించి పట్టుకోవాలని ప్రశ్న.

Page 11