#


Index

  దీనినే నిత్యమూ మనం మన వెలపలా లోపలా కూడా దర్శిస్తున్నాము. వెలపల వస్తు రూపంగా లోపల భావరూపంగా. దీనితోనే యావజ్జీవమూ వ్యవహరిస్తున్నాము. దీనిమూలంగానే నానా విధాలైన కష్టసుఖాలూ అనుభవిస్తున్నాము. ఇదే పెను సమస్య ఇప్పుడు మనకు. దీనినే సాధకులమై మనమిప్పుడు పరిష్కరించుకోవలసింది. కనుక ఇదే సాధన మార్గంలో మొదటి భూమికగా నిర్దేశిస్తున్నా రాచార్య వర్యులు ఇత్యాభాతి చరాచరాత్మకమని చరాచర రూపంగా చూచే ప్రపంచ మిదేనట. ఇదేమన ముందున్న సమస్య చేతనైతే దీనిని పరిష్కరించు కోమని సలహా ఇస్తున్నారు.

  అయితే ఊరక సలహా ఇస్తే ఏమి లాభం. పరిష్కరించే ఉపాయమేదో అది కూడా చెప్పాలి గదా. అదే చెబుతున్నారు యస్యైవ మూర్త్యష్టకమని. మూర్త్యష్టక మంటే అష్ట విధాలుగా విభక్తమై కనిపిస్తున్న ఈ చరాచర రూపాలు. ఇవే మూర్తులు ఇవి నీవు మూర్తులుగా నీకు బాహ్యంగా ఉన్నట్టు చూస్తున్నావే. ఇవేవో గావు "యస్యైవ” అమూర్తమైన ఆ చైతన్య రూపాలే అదే మూర్తీభవించి ఇలా కనిపిస్తున్నది మన కంటికి. అని ఈ అనాత్మ ప్రపంచాన్ని ఆత్మ చైతన్యంతో ముడి పెడుతున్నా రాయన. దీనితో మన దృష్టి ఇంతవరకూ కార్య జగత్తు మీదనే తారాడుతున్నదల్లా ఇప్పుడు దీని నుంచి బదిలీ అయి ఇది దేనినుండి వచ్చిందో దానిమీద పోయి వాలుతుంది. అంటే ఏమన్నమాట ఇంతవరకూ ఈ కార్యమే కనపడుతున్నది మన కంటికి దీని కారణం కనపడటం లేదు.

Page 84