#


Index

  కాగా ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని ఎవడందుకొని అనుభవానికి తెచ్చుకోగలడో అలాటి గురువు కూడా ఆకోవకే వస్తాడు. కాబట్టి ఆ దక్షిణామూర్తే గురుమూర్తి కూడా. పోతే ఆ గురూపదేశ బలంతో శ్రవణమననాదులు చేసిన శిష్యుడు కూడా ఆ స్థాయికే ఎదిగిపోతాడు. కాబట్టి ఆ గురుమూర్తే తస్మై అనే శిష్యమూర్తి కూడా. మొత్తంమీద అఖండాత్మ జ్ఞానమే దక్షిణ. అదే తన స్వరూపాన్ని మనకు తానే స్వయంగా వివరిస్తున్నది. కాబట్టి గురువయింది. దానినే అది మరలా వరించి పట్టుకొంటున్నది. కాబట్టి శిష్యుడు కూడా అదే అయింది. ఇలా భావన చేస్తే మూడుగా కనపడుతున్నా మూడూ కలిసి చివర కద్వైతరూపమైన దక్షిణామూర్తే మరేదీ కాదని గ్రహించాలి.

  ఇది దక్షిణామూర్తి సంకేతం. దక్షిణామూర్తి దగ్గరి నుండి మరలా మనం దక్షిణా మూర్తి దగ్గరికే వచ్చి చేరాము. అలా చేరాలనే భగవత్పాదులు అసలీ స్తోత్రం రచించింది. అది గమనించే నేను కూడా నా యీ వ్యాఖ్యానానికి ప్రదక్షిణమని పేరు పెట్టింది. నేనీ స్తోత్రానికి వ్యాఖ్య వ్రాయుటమిదే ప్రథమం కాదు. ఇంతకు ముందే సంస్కృతంలో ఒకటి వ్రాసి ప్రకటించాను. అది సంస్కృతంలో ఉంటే మాకర్థం కావటం లేదు. అందరికీ అర్థమయ్యే తెలుగులో వ్రాసి ప్రకటిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు కొందరు మిత్రులు. వారికోసమని మరలా తెలుగులో ఒకటి ఇటీవల వ్రాసి ప్రచురించాను. అయితే అది మరీ సంగ్రహంగా వ్రాశారు- మాకు తృప్తినివ్వటం లేదన్నారు మరి కొందరు శిష్యులు ఆ మాటకు వస్తే వారికే గాదు నాకూ ఇవ్వలేదది వాస్తవంలో అంచేత నలుగురికి తృప్తి కలిగేలా బాగా విపులంగా వ్రాయాలని వ్రాశానిప్పుడీ వ్యాఖ్యానం.

Page 8