అర్ధనారీశ్వరంగా తత్త్వాన్ని భావిస్తే అందులో దక్షిణ ఒక అర్థం, వామ మరొక అర్థం. దక్షిణ మంటే కుడివైపు. అది పుంభావం. వామ అంటే ఎడమవైపు. అది స్త్రీ భావం. ఒకే ఒక చైతన్య తత్త్వం స్త్రీ పుం రూపంగా రెండు భాగాలయింది. "స్త్రీ పుంసావాత్మ భాగౌతే భిన్న మూర్తేస్సిసృక్షయా"-” అన్నాడు మహాకవి కాళిదాసు. రెండూ ఆత్మభాగాలే, దక్షిణభాగమొకటి. వామభాగమొకటి. దక్షిణ దక్ష అంటే కుడి అనేగాదు. వాచ్యార్థమదే అయినా సమర్థమైనదని లాక్షణికార్థం. స్వతంత్రమైనదేదో అదే సమర్థం. అది జ్ఞానమే మరేదీ గాదు. స్వతఃప్రమాణమూ, స్వతస్సిద్ధమూ అయినదది. అందుకే దక్షిణ అని పేర్కొనటం. అక్షి పురుషవిద్యలో దక్షిణాక్షికి ప్రాధాన్యమివ్వటం కూడా ఇందుకే. చైతన్యశక్తి రెండక్షుల లోనూ దక్షిణాక్షిలోనే విశేషంగా అభివ్యక్తమవుతూందని కూడా వ్రాశారు భాష్యకారులు. కాబట్టి అమూర్తమైన తత్త్వానికి దక్షిణమైన మూర్తి జ్ఞానశక్తే.
పోతే ఈ జ్ఞానాన్ని ఆశ్రయించుకొని ప్రసరించే క్రియాశక్తి ఏదుందో అది వామ. “వమతీతి వామా” అని తాంత్రికులు వ్యాఖ్యానిస్తారీ శబ్దాన్ని వమన మంటే వెళ్ళగ్రక్కటం. జ్ఞానం వెళ్ళగ్రక్కినదే క్రియ. అదే అనాత్మ సృష్టి కంతటికీ ఆధారం. క్రియ లేకుంటే సృష్టి లేదు. జ్ఞానం లేకుంటే క్రియలేదు. జ్ఞానం వరకూ నిలిస్తే అది స్వరూపదశ. అది స్వరూపంలోనే గర్భితమై ఉంటుంది. స్వరూపమొకటి వర్ణిస్తే చాలు. అది కూడా కలిసివస్తుంది కనుకనే దక్షిణామూర్తి అంటే అఖండ జ్ఞానశక్తే! మరేదీ గాదు. "జ్ఞానశక్త్యవతారాయ దక్షిణామూర్తయే నమః” అని వార్తికకారులే బయట పెట్టారీ రహస్యాన్ని.
Page 7