విచారించి చూస్తేగాని సత్యమేదో అసత్యమేదో బయట పడదు. లేకపోతే సత్యమే అసత్యంగానూ అసత్యమే సత్యంగానూ భాసించే ప్రమాదముంది. ఇది నివారించాలంటే ముందు పేర్కొన్న ప్రత్యభిజ్ఞా సూత్రాన్ని విడవకుండా దానిమీదనే సాగించాలీ విచారణ.
అది ఎలా సాగించాలో సెలవిస్తున్నారు భగవత్పాదులు. "బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వా స్వవస్థాస్వపి వ్యావృత్తాసు” మనకు బాల్యం పోయి యౌవనం వచ్చింది. యౌవనం పోయి వార్ధక్యం వచ్చింది. వార్ధక్యం పోయి రేపు అవసానం కూడా ప్రాప్తిస్తుంది. ఇది జీవితం మొత్తం మీద నైతే- ఏ రోజుకారోజు కూడా దశలు మారుతూ పోతున్నాయి. జాగ్రద్దశ మారి రాత్రి స్వప్నదశ వస్తున్నది. స్వప్నం కూడా పోయి సుషుప్తి వస్తున్నది. ఆ సుషుప్తి పోయి మరలా జాగ్రత్తులోకి వచ్చి పడుతున్నాము. అంతేగాదు. ఈ జాగ్రదాది దశలలోనే ఒక్కొక్క క్షణం ఒక్కొక్క అనుభవం మారిపోతున్నది. ఒక క్షణం సుఖమైతే మరొక క్షణం దుఃఖం. ఒక క్షణం ధైర్యం మరొక క్షణం దైన్యం. ఇలా జన్మించిన క్షణం మొదలు జీవితాంతం వరకూ ఎన్నెన్నో అవస్థలూ అనుభవాలూ వస్తున్నాయి పోతున్నాయి. వీటిలో ఏ ఒక్కటీ నిలకడగా ఉండటం లేదు. దీనికే వ్యావృత్తి Discontinuity అని పేరు. ఎప్పటికప్పుడు మారిపోవటమే వ్యావృత్తి అంటే. బాల్యాదులన్నీ “వ్యావృత్తాసు” ఇలా వ్యావృత్త మవుతున్నవే దృష్ట నష్ట స్వభావాలవి. కనిపించినంతసేపు పట్టదవి కనుమరుగయి పోవటానికి.
పోతే ఈ వ్యావృత్తికి భిన్నమైనది అనువృత్తి Continuity అనువృత్తి అంటే అలా తొలగిపోకుండా ఎప్పటికీ నిలిచి ఉండటమని అర్థం
Page 66