#


Index

  అంచేత ఆభరణంగా కనిపిస్తున్నా అది సువర్ణ రూపమే. సువర్ణమే కటక కుండలాదులైన ఆభరణాల రూపంలో కనబడుతూందని అర్థం.

  అలాగే విశ్వ వ్యాపకయైన ఏ ఆత్మ చైతన్యముందో అదే మన ఈ శరీరమూ - ప్రాణమూ ఇంద్రియాలూ ఇవి మొదలుకొని పృధివ్యాదికమైన సమస్త ప్రపంచం దాకా చిత్ర విచిత్రమైన ఇన్ని రూపాలలో భాసిస్తున్నదని గ్రహించాలి మనం. సువర్ణానికి కటక కుండలాదులు రూపాలయినట్టే. శరీరమనః ప్రాణ వన నదీ పట్టణ పర్వత గ్రహ నక్షత్రాదులైన చరాచర పదార్థాలన్నీ శుద్ధ చైతన్య రూపాలే Forms మరేవీ కావు. శరీరంలో ఉన్నా అది శరీరం లోపలనే గాక శరీరం వెలపల కూడా సర్వత్రా వ్యాపించి ఉంది. దాని రూపాలే ఈ శరీరాదులు కాబట్టి దానికి భిన్నం కావివి. కావు గనుకనే అదే ఉంది ఇవి లేవు వాస్తవంలో అదే అంటే ముందు చెప్పిన త్వం పదార్థం “జానామీతి యమేవ భాంతం" . నేనున్నాను నేనే అన్నిటిని ఉన్నట్టు తెలుసుకొంటున్నాని - ప్రకాశిస్తున్నదే అది. అదే ఇప్పుడున్నదీ శరీరంలో కాదు. శరీరం కూడా అదే కాబట్టి నిజానికి శరీరాద్యుపాధి రహితంగా అదే ఉన్నది. ఈ శరీరాదులే లేవు.







Page 46