దృష్టమైన దాన్ని ఆధారం చేసుకొనే అదృష్టమైన భావాన్ని ఎప్పటికైనా మనం వెదకి పట్టుకోవలసింది. లేకపోతే అన్వేషణ మనేది నేల విడిచిన సాములాగా నిరాధార మవుతుంది. ఇప్పుడొక ఈశ్వరచైతన్య మంతటా వ్యాపించి ఉందని నీవు నేను చాటా మంటే దేని బలంతో చాటా మీమాట. అంతకు ముందొక చైతన్యం మన శరీరంలో సిద్ధమై ఉంటేనే గదా. ఏదీ అలాంటి చైతన్య మీ శరీరానికి విలక్షణంగా మనలో ఏముందని చూపగలవు. శరీరమే మనకు కనిపిస్తున్నది కంటికి ఇది పాంచ భౌతికం పృధివ్యాది పంచభూతాలూ పంచీకృతమై ఒకానొక మోతాదులో ఒనగూడితే ఈ శరీరమేర్పడింది.
పోతే దీనిలో పొదిగినట్టున్న కరచరణా ద్యవయవాలూ చక్షురాదీంద్రియాలూ కూడా - శరీరంలాగా భౌతికాలే వీటిని నడిపే ప్రాణశక్తి ఏదుందో అది కూడా ఒక వాయు విశేషమే. చలనాత్మకమైన వాయువే. అది శరీరంలో ప్రవేశించి ప్రాణాపాన రూపంగా ఈ శరీరేంద్రియాది సంఘాతాన్ని అంటి పట్టుకొని ఇది పడిపోకుండా విడి పోకుండా ధరించి ఉన్నది. అందుకే దాన్ని సూత్రమన్నారు. “సూత్రే మణిగణా ఇవ” ఒక దారంలో పూసలలాగా ఇంద్రియ వ్యాపారాలన్నీ ఈ సూత్రంలో ఓత ప్రోతమై Interwoven ఉన్నాయి. పూసలూ భౌతికమే, సూత్రమూ భౌతికమే, అలాగే పూసలలాంటి ఇంద్రియాదులెలా భౌతికమో వాటిని ధరించి నడుపుతున్న ఈ ప్రాణశక్తి కూడా కేవలం భౌతికమే. అబ్ధాతువు Hydrogen తాలూకు సూక్ష్మ రూపమే ప్రాణమని ఛాందోగ్యం చాటుతున్నది.
Page 38