#


Index

  అది ఎలా కనిపిస్తుంది? కనిపిస్తే దేనికి కనిపించాలది? మరలా ఆ నేననే స్ఫురణకే గదా. స్ఫురణకు స్ఫురణ Awareness కనిపించటమేమిటి? అర్థం లేని మాట. రెండూ స్ఫురణే అయినప్పుడొక దానికొకటి కనిపించడం పొసగదు. రెండు వెలుగులొక దాని నొకటి ప్రకాశింపజేయగలవా? అలాగే ఇదీ కాబట్టి నేననే స్ఫురణ ఎప్పటికీ కనిపించదు. కనిపించిందంటే అది నేను కాదు. అంటే ఆత్మ కాదు. ఆత్మ కాదంటే ఇక అనాత్మే అయి ఉండాలి. మన శరీర మనః ప్రాణాదులతో సహా ఈ ప్రపంచమంతా మనకిప్పుడు కనిపిస్తున్నది. కాబట్టి ఇదంతా అనాత్మే ననటంలో ఆక్షేపణ లేదు.

  అనాత్మ గనుకనే ఆత్మ లాగా ఇది సత్యం కాదు. అసత్యం అసత్యమెలా అయింది? తన పాటికి తాను స్వతస్సిద్ధంగా లేదు గనుక. తన పాటికి తానుండాలంటే నేనున్నానని అనుకోగలగాలి. అలా అనుకోగలిగింది నేనే. నేనున్నాననే భావం నాకెప్పుడూ ఉంది. నాపాటికి నాకే కలుగుతూ ఉందది. మరొక రెవూ కలిగించనక్కరలేదు. స్వతస్సిద్ధమైనదీ స్ఫురణ నాకు. పోతే నా యీ స్ఫురణకే గోచరిస్తున్నది. ఈ ప్రపంచమొకటి ఉందని అంటే నాకు నేనున్నానని భావిస్తూ నాతోపాటు ఈ జగత్తు కూడా ఒకటుందని భావిస్తున్నానన్న మాట. నన్ను బట్టే ఈ జగత్తు. మొదట నేనున్నాననే స్ఫురణ. తరువాత దానిని బట్టి ఈ ప్రపంచం కూడా ఉందనే భావన. ఏది మొదటిదైతే అది కారణం. ఏది తరువాతిదైతే అది కార్యం. ఇందులో మొదటి దేది? నేననే ఆత్మ స్ఫూర్తి.

Page 32