#


Index

  సత్తు లేని చిత్తు లేదు. చిత్తులేని సత్తు లేదు. అంటే ఏమన్న మాట? మొదట నేనుంటేనే గానీ ఉన్నానని అనుకోలేను. అలాగే ఉన్నానని మొదట అనుకొంటేనే గాని ఉండలేను. ఒకదాని నపేక్షించి ఒకటున్నది. అలాంటప్పుడివి రెండూ వేర్వేరు లక్షణాలు కావటానికి వీలు లేదు. రెండూ ఒక్కటే అయి ఉండాలి. ఉంటూనే అనుకోవాలి. అనుకొంటూనే ఉండాలి. అంటే సత్తే చిత్తు చిత్తే సత్తు అందుకే సదాత్మకం స్ఫురణ మని రెంటినీ కలిపి ఒకే తత్త్వంగా నిర్దేశించారాచార్యుల వారు.

  ఈ సదాత్మకమైన స్ఫురణ అంటే నేనున్నానను అనే భావన దేనికి సంబంధించిందీ భావన? నేనున్నాని ఏది భావించగలదో దానికి. అది ఆత్మకే గాని అనాత్మకు కలగదు. అసలాత్మ అంటేనే నేను అని అర్థం. నేను నేను అనే స్ఫురణనే గదా ఆత్మ అని పేర్కొన్నాము. కనుక నేనున్నాననే స్ఫూర్తి ఆత్మకు చెందిన ధర్మమే గాని అనాత్మ ప్రపంచానికి చెందింది కాదు. ఏమో అనాత్మ జగత్తుకు చెందింది కాదని ఎలా నిర్ణయించగలం? మనలాగా ఈ ప్రపంచం కూడా అనుకోవచ్చు గదా నేనున్నానని. అనుకొంటున్నదేమో కూడా ఇప్పుడు నీకూ నాకూ ఏమి తెలుసునని ఆశంక కలగవచ్చు చాలామందికిక్కిడ. కాని అది అవిచార మూలకమైన ఆశంక. నేనున్నానని నాకెలా అనిపిస్తున్నదో, అలాగే ఈ ప్రపంచానికి కూడా అనిపించవచ్చునని గదా నీ ఆలోచన. ఈ ఆలోచన కలుగుతున్నది కూడా నీకూ, నాకే గాని, ప్రపంచానికి కాదు. ఈ ప్రపంచమొకటి ఉన్నదని నీవూ నేను అంటున్నాము.

Page 30