కాబట్టి అంతర్గతమని చెప్పినా దానికన్నా విలక్షణం గాదది మరలా అద్వయమే ఆత్మరూపంగా ఏకమే. కనుక అంతర్గతమంటూ అది మరలా అద్వయమెలా అయిందని ఆశ్చర్యపడ నక్కరలేదు. కారణం కంటే కార్య భిన్నం కాదన్నప్పుడీ కార్యప్రపంచమంతా శక్తి రూపమే. కాగా శక్తి, శక్తిమంతులకు భేదం లేదు గనుక అది కూడా చివరకు ఆత్మ స్వరూపమేనని అర్థం చేసుకోవాలి సాధకుడు.
3
ప్రపంచానికంతటికీ ఆత్మ చైతన్యమే కారణం! దాని లక్షణాలే కార్య ప్రపంచం లోనూ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఆత్మ కన్నా విలక్షణం కాదు. అద్వయమేనని పేర్కొన్నాము. మంచిదే! అలాంటప్పుడు కారణ గుణాలు కార్యంలో కనిపించాలి గదా. అప్పుడే గదా అది దానితో ఏకమని నిరూపించగలం. ఏదీ అలాటి గుణాలు ఏమి కనిపిస్తున్నవీ ప్రపంచంలోనని ప్రశ్న.
దీనికి సమాధానమే చెబుతున్నారాచార్యుల వారిప్పుడు. యస్యైవ స్ఫురణం సదాత్మకమని. సదాత్మకమైన స్ఫురణం. ఇదీ ఆత్మకున్న గుణం. స్ఫురణ మంటే స్ఫురించటం లేదా అనిపించటం. ఏమని? నేను ఉన్నానని ఉండటమే సత్తు అనుకోవటమే చిత్తు.
Page 29