#


Index

  బాహ్యమైన సామగ్రి ఏదీ అక్కరలేదు వారికి. వారి శక్తే వారికి సామగ్రి-'యఃస్వేచ్ఛయా'. తమ ఇచ్చా శక్తి ఒక్కటే చాలు. ఆ ఇచ్ఛా శక్తితోనే వారి జ్ఞానం క్రియగా మారుతుంది. దానితో ఏయే రూపం కావాలంటే అది కనిపిస్తూ పోతుంది లోకులకు. ఇది బీజాదుల శక్తిలాగా జడశక్తి కాదని గదా వాక్రుచ్చాము. జడశక్తి కాదు గనుకనే మాయవి ప్రభృతులు వారి పాటికి వారే సంకల్పించగలరు. సృజించగలరు. బీజాదుల అలా సంకల్పించటం గాని సృజించటం గాని చేయలేవు. మరొక చేతన పదార్థం సంకల్పం వల్లనే అంకురాదులుగా మారవలసి ఉందవి. అంతేగాక వాటి శక్తి పరిచ్ఛిన్నమైనది. పోతే ఈ యోగులు మొదలైన వారి శక్తి చైతన్యరూపమే గాక అపరిచ్ఛిన్నమైనది.

  అలాంటప్పుడీ జడ పదార్థాలనూ మాయావులూ యోగీశ్వరులు మొదలైన చేతన పదార్థాలనూ కోటాను కోట్లను తన సంకల్ప మాత్రం చేతనే సృష్టించగల, పెంచగల, త్రుంచగల ఆ పరమాత్మ శక్తి ఇక ఎలాంటిదయి ఉండాలో కొంచె మూహించండి. ఊహకే అతీతమది. పరిపూర్ణమైన చైతన్యం గనుక దాని శక్తి కూడా అన్నిటికన్నా పరిపూర్ణమైనది. అదే మాయ. అనిర్వచనీయమైన ఆ మాయా శక్తి కార్యమే. ఈ భౌతిక ప్రపంచమంతా. దాని కార్యమే గనుక ఇదంతా అవ్యక్తమైన ఆశక్తి స్వరూపమే ఆ శక్తి మరలా ఆత్మచైతన్యమే.

  కాబట్టి బహిర్గతమైన ప్రపంచమంటూ ఏదీలేదు వాస్తవంలో ఆలోచిస్తే అది అంతర్గతమైన మాయా శక్తి. ఆ శక్తి కూడా ఆత్మచైతన్యమేనని పేర్కొన్నాము.

Page 28