ప్రదర్శిస్తున్నంత వరకూ ఐంద్రజాలికుడనీ వాడిశక్తి అనీ తజ్జన్యమైన ఒక వస్తు జాలమనీ మూడుంటాయి. భావాలు ఉపసంహరిస్తే ప్రపంచం పోయి వాడూ, వాడి శక్తీ రెండే మిగిలాయి. ఆ శక్తి కూడ వాడి స్వరూపమే కాబట్టి నిజానికి మిగిలింది వాడొక్కడే.
పోతే మరియొక దృష్టాంతం! యోగి దృష్టాంతం. మహాయోగీవ. ఒక యోగి శక్తి ఐంద్రజాలికుడి శక్తి కన్నా గొప్పది. అది క్షుద్రమైతే ఇది చాలా ప్రశస్తమైనది. దీనినే లోకంలో మహిమ అని వర్ణిస్తుంటారు. మన పురాణకథలలో వర్ణించే ఋషులు, దేవతలు అప్పుడప్పుడు ప్రదర్శించారని చెప్పే మహిమలన్నీ ఇలాటివే. భరద్వాజుడనే ఋషి భరతుడికీ అతడి సైన్యానికీ గొప్ప విందు చేశాడని రామాయణంలో వర్ణించారు. విశ్వామిత్రుడు వేటకు వచ్చి అలసిపోతే వసిష్ఠుడాయనకూ సైన్యానికీ తన కామధేనువు ప్రభావంతో అప్పటికప్పుడెంతో గొప్ప ఆతిధ్యం చేశాడని ఉంది భారతంలో. మరి ఆ విశ్వామిత్రుడే తరువాత బ్రహ్మర్షిగా మారి తపః ప్రభావంతో అపర స్వర్గాన్నే ఆకాశంలో సృష్టించాడట. ఇక సంవర్తాది యోగీంద్రుల మాహాత్మ్యమైతే చెప్పనే అక్కరలేదు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఆయా కాలాల్లో ఆయా యోగీశ్వరులు ప్రదర్శిస్తూ వచ్చిన మహిమలు. ఇప్పుడూ లేకపోలే దిలాంటి తపస్సంపన్నులు కొందరీ లోకంలో. అయితే మరుగుపడి ఉంటారు మన కంటికి.
వీరందరూ ఇలాటి మహిమలు ప్రదర్శించారంటే ఎలా ప్రదర్శించగలిగారు? వారికేమిటి ఆధారం? ఏమిటి సామగ్రి?
Page 27