ఎందుకంటే మొక్కైనా మానైనా మహావృక్షమైనా ఎక్కడ ఏ భాగం తడవి చూచినా దానిలో ఆ బీజ లక్షణాలే తప్ప మరొక విలక్షణమైన తత్త్వమేదీ కానరాదు. అంచేత బీజమే తన శక్తివల్ల తానొక అంకురంగా, వృక్షంగా వివిధ రూపాలలో కనిపిస్తున్నదని చెప్పాలి మనం.
అలాగే ప్రస్తుత మీ ఆత్మ చైతన్యం కూడా తన పాటికి తానొకే ఒక నిర్వికల్పమైన తత్త్వం. అయితే దానికీ బీజానికి మాదిరే ఒక అద్భుతమైన శక్తి ఉన్నది. బీజాదులింకా నామరూపాత్మకమైన పదార్థాలు. కనుక వాటికున్న శక్తి పరిమితం. మరి ఈ చైతన్యమో! ఇది విశ్వవ్యాపకం. అనంతం. అంచేత దీనికున్న శక్తి కూడా అనంతమే. పైగా ఇది వాటిలాగా అచేతనం కాదు. చేతనం. ఈ అనంతమైన చైతన్య శక్తికే మాయ అని పేరు పెట్టారు వేదాంతులు. “మీయతే అనయా ఇతి మాయా” ఒక పదార్థాన్ని ఏది కొలిచి పారేస్తుందో అది మాయ. తానాశ్రయించిన ఆ మహాచైతన్యాన్ని కొలిచి పారేసింది దాని శక్తి. పారేయలేదు నిజంలో. పారేసినట్టు కనిపిస్తున్నది. కారణం చైతన్యం కంటే విలక్షణం కాదా శక్తి. పైగా దానిదే ఆశక్తి. అలాంటప్పుడు దాన్ని ఇదేమి చేయగలదు? అయితే మరేమిటంటారు? ఆ చైతన్యమే తన శక్తి ప్రభావంతో తనకు తానే మరో రూపంలో భాసిస్తున్నది అదే ఈ ప్రపంచం.
అది కూడా మూకుమ్మడిగా గాక ఒక క్రమంలో జరిగిందా పరిణామం. మాయా కల్పిత దేశకాల కలపనా వైచిత్ర్య చిత్రీకృత మన్నారు. మొదట దేశమనే పేరుతో ఆవిర్భవించిందా మాయ.
Page 24