తరువాత అది కదలి కాలమయింది. ఆ కాలం మూర్తీభవించి కలన లేదా వస్తువయింది. దేశం, కాలం, వస్తువు Space, Time and Substance ఇవి మూడూ మూడు పరిచ్చేదాలు Three dimensions. ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్పే త్రిపరిచ్ఛేదాలూ ఇవే. సమస్త ప్రపంచానికీ ఇవి పునాదుల వంటివి. ఒకటి కదలనిది, ఒకటి కదిలేది, ఒకటి నిలిచి కనిపించేది. ఇవి మాయా శక్తి మూలంగా ఏర్పడి కనిపిస్తున్న చైతన్య ఖండాలు. సప్త వర్ణాలూ కలగాపులగమై అనేక వర్ణాలుగా మారినట్టు-సప్తస్వరాలూ స్వరసమ్మేళనంతో అసంఖ్యాకంగా మారినట్టు ఇవి మూడూ చిత్ర విచిత్రంగా కలిసిపోయి ఈ అద్భుతమైన జగచ్చిత్రంగా పరిణమించి ఇలా దర్శనమిస్తున్నాయి.
అయితే ఇదంతా ఆమాయా శక్తి విలాసమే అయినా అది బీజాదుల శక్తిలాగా జడశక్తి కాదని చెప్పాము. జడం కాకపోతే మరేమిటి? చైతన్యాన్ని అంటిపెట్టుకొన్నది గనుక చిచ్ఛక్తి Conscious Power అది. అంటే ఏమన్నమాట? ఎలా పరిణమిస్తున్నా ఎంతగా పరిణమిస్తున్నా ఇదంతా నేనే కదా ఇలా పరిణమిస్తున్నాననే ప్రజ్ఞ ఉంది దానికి. జ్ఞానశక్తే గదా అది. కనుకనే జ్ఞానం కంటే వేరుగాదు. అలాగే దాని మూలంగా ఏర్పడిందే ఈ వస్తు ప్రపంచమంతా. అవ్యక్తమైనది శక్తి అయితే వ్యక్తమైన శక్తి రూపమే ప్రపంచం. కనుక ఈ ప్రపంచం మనకిలా గోచరిస్తున్నా ఇది శక్తి కన్నా వ్యతిరిక్తం కాదు. ఆ శక్తి ఆత్మచైతన్యం కన్నా విలక్షణం కాదు.
Page 25