లోపల ఉందని చెప్పినా చైతన్యమూ ప్రపంచమూ నని ఆధారాధేయ భావంతో లేవవి. రెండూ కలిసి ఒకే ఒక పదార్థం. అది చైతన్యం. మరి ఒకే పదార్థమయినప్పుడు చైతన్యం లోపల ప్రపంచ ముందని ఎందుకు చెప్పవలసి వచ్చిందని అడగవచ్చు. మనం దాన్ని చైతన్యానికి బాహ్యంగా చూస్తుంటే అది బాహ్యంగా లేదని నీకు నచ్చజెప్పటానికి మొదట దాని నంతర్గత మని చెప్పవలసి వచ్చింది. అంతర్గత మంటే మరలా నీవు దానికి భిన్నంగా విభక్తంగా ఉందని అపోహ పడతావని విభక్తం కాదు అంతర్గతమైనా దానితో అవిభక్తమేనని మరలా చాటవలసి వచ్చింది అంత మాత్రమే.
అయితే అవిభక్తమైన దలా అవిభక్తంగానే ఉండిపోవచ్చు గదా! బహిర్గతమెలా కాగలిగిందీ ప్రపంచం? అంకురమెలా అయిందో అలాగే అయిందని చెబుతున్నా రాచార్యులవారు. అంకురం బీజంలో బీజ రూపంగానే oది గదా. అది అలాగే ఉండక మరలా అంకురమనే పేరుతో ఎందుకావిర్భవించింది? అని అడిగితే ఏమిటి జవాబు. బీజంలోనే ఒక శక్తి ఉంది. అంకురోత్పాదక శక్తి అది. బీజాన్ని ఆశ్రయించి ఉన్న ఆ శక్తి నిరాకారం గనుక అది బీజంతో అవినాభావంగా ఓత ప్రోతమై ఉంటుంది. శక్తి శక్తిమంతుల కెప్పుడూ భేదం లేదని సిద్ధాంతం. సిద్ధాంతమే గాక ఇది మనకు సర్వత్రా దృష్టమయ్యే విషయం కూడా. బీజమూ, బీజశక్తి రెండూ ఒక్కటే. ఈ శక్తి అనేదే ఆ బీజాన్ని అంకురంగా మార్చి చూపుతున్నది. మార్చటం కూడా కాదది వాస్తవంలో. మారినట్టు చేసినట్టు మనకు భాసిస్తున్నది.
Page 23