#


Index

  విత్తనంలో అంతర్గతంగా మొదట లేకపోతే తరువాత దాని నుండి బహిర్గతమై ఎలా కనిపించగలదు? అసలే లేని పదార్థం ఉన్నట్టుండి హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడి పడదు. అలా పడ్డట్టు మనకిప్పుడు కనిపిస్తున్నదంటే అంతకు ముందే అది దాని మూల పదార్థంలో గుప్తమై ఉండాలి అంటే ఏమన్నమాట? అంతర్గతమైనదే ఎప్పుడు గానీ బహిర్గతం కావలసింది.

  ఇంతవరకూ మన కెవరికీ ఆక్షేపణ లేదు. మరి నీ కాక్షేపణ అల్లా ఎక్కడంటే లోపల ఉందని చెప్పే పదార్థం దాని మూల పదార్థంతో అద్వయ Identical మెలా అవుతుందని? ఎలా అవుతుందో ఈ బీజాంకుర దృష్టాంతమే చెబుతుంది మనకు. విత్తనంలో నుండే గదా అంకురం వచ్చిందంటున్నావు. రాకపూర్వమది ఆ విత్తనం లోనే గదా ఉండాలి. ఏదీ! ఎలా ఉందో అప్పుడు దాని స్వరూపం నీవే చెప్పు. విత్తనం కన్నా విలక్షణంగా ఉందా దాని లోపల? లేక దానితో అవిభక్తమై ఏకంగా ఉందా? వేరుగా ఉందనే అభిప్రాయమే అయితే ఆ విత్తనం పగలగట్టి చూడు నీకే తెలుస్తుంది. ఏదీ! పగలగొడితే అంకుర మెక్కడ కనిపించింది నీకు? వేరయితే విత్తనానికి భిన్నంగా కనిపించి తీరాలి గదా. మరి కనిపించటం లేదే. కనిపిస్తున్నదప్పుడు ఒకే ఒక పదార్థం. విత్తనం. అంతకుమించి విత్తనమని, అంకురమని రెండు పదార్థాలు లేవక్కడ. వికల్పానికే చోటు లేదు. అలాగే ప్రాజ్నిర్వికల్పం. సృష్టికి పూర్వమీ చరాచర విశ్వమంతా మన ఆత్మ చైతన్యంలో అంతర్లీనమై దానితో అవిభక్తంగానే ఉంటున్నది.

Page 22