సమస్య ఎక్కడ ఉందో అక్కడే గదా చేయవలసింది ప్రయత్నం. సమస్య విశ్వమే గనుక దానినే ప్రస్తావిస్తున్నారు విశ్వమని.
మంచిదే కాని ఎలా పరిష్కరిస్తారిప్పుడీ సమస్యను విశ్వమనేది ఇంతకూ ఉందనా? లేదనా? ఏదో ఒక మాట చెప్పాలి గదా. ఉందంటే ఒక ఇబ్బంది. లేదంటే మరొక ఇబ్బంది. విశ్వమనేది ఉందని చెప్పామంటే అది పరిష్కారమే కాదు. ఎందుకంటే అప్పుడు సమస్య ఒకటి ఉందని ఒప్పుకొన్నట్లవుతుంది. ఉందని మనందరికీ తెలిసిన విషయమే. అది తొలగించుకోవటమెలాగా అనే మన మిప్పు డాలోచిస్తున్నది. తొలగించు కోవటానికి బదులు ఉందని మరలా పేర్కొని ఏమి ప్రయోజనం? సమస్య సమస్యగానే మిగిలిపోతుంది కాబట్టి సమస్య నివారణ కావాలంటే దాన్ని లేదనే నిరూపించగలగాలి.
పోనీ లేదనే నిరూపిద్దామంటే అది చెల్లే విషయం కాదు. ఎందుకంటే మనమీ ప్రపంచాన్ని ప్రతి క్షణమూ చూస్తున్నాము. దీనితో వ్యవహరిస్తున్నాము ఆబాల గోపాలమూ ఇది అందరికీ ప్రసిద్ధమే. లోపలా వెలపలా కూడా ఇది జగత్తును లేదని వాదిస్తే ఏమి బాగు? అది మన అనుభవానికే విరుద్ధమైన మాట. అన్నిటికన్నా గొప్ప ప్రమాణ మనుభవమే గదా. అలాంటి అనుభవాన్నే కాదంటే అది ఆత్మవంచన అనిపించు కొంటుంది.
ఇంతకూ రెండూ రెండు ఇబ్బందులయి కూర్చున్నాయి. ప్రపంచం లేదంటే ఆత్మ వంచన. ఉందంటే పరిష్కారమే కాదు. మరి ఈ సమస్య తీరటమెలాగ? ఒక సమస్య కిప్పుడు మరి ఒక సమస్య తోడయింది
Page 15