నామం | అంతరార్థము |
---|---|
విశ్వమ్ విష్ణుః వషట్కారః |
విష్ణు సహస్ర నామమిది విశ్వమనే నామంతో ఆరంభమవుతున్నది. ఏమిటి సబబు. విశ్వం మనకు సమస్య. విష్ణువు దానికి పరిష్కారం. మొదట సమస్యను తరువాత దానికి పరిష్కారాన్ని సూచించటం పరిపాటి. విశ్వమనేది ఇహమైతే యజ్ఞ సంబంధి అయిన వషట్కారం పరాన్ని సూచిస్తున్నది. మధ్య ఉన్న విష్ణు శబ్దం దేహళీదత్త దీపం లాగా రెండింటినీ వ్యాపించి ఉంది. దీన్ని బట్టి ఇహపరాలు రెండూ విష్ణువు కంటే వేరుగా లేవు. రెండూ విష్ణువేనని చెప్పినట్టయింది. |
భూతభవ్య భవత్ప్రభుః |
ఇహపరాలే కావు. భూత భవిష్యద్వర్తమానాలని మనం చెప్పుకొనే మూడు కాలాలు కూడా విష్ణుతత్త్వమే. ప్రకర్షణ భవతీతి ప్రభుః - మూడింటికీ ప్రభువని కాదు. మూడుగా అయినవాడు విష్ణువేనని అర్థం. |
భూతకృత్ భూతభృత్ భావః |
అంతేకాదు. చరాచర పదార్థాలను సృష్టిస్తున్నది పోషిస్తున్నదీ వాటిని తుదకు వాటిని తనలో కలుపుకొంటున్నదీ భావయతి అంతర్భావయతీతి - ఆ విష్ణువే - ఈ విధముగా దేశకాల వస్తువులనే మూడింటినీ వ్యాపించిన తత్త్వమేదో అది విష్ణువు. విష్ణ వ్యాపౌ. ఏది వ్యాపిస్తుందో అదీ విష్ణుశబ్దార్థం. |
Page 7