నామం | అంతరార్థము |
---|---|
వీరహా రక్షణః సంతః జీవనః పర్యవస్థితః |
విరుద్ధంగా నడచుకొనే గర్విష్ఠులను క్షమించడు. త్రోసి పారేస్తాడు. అలాకాకుంటే రక్షణ ఇస్తాడు. వివేచనాశీలు రందరూ (సంతః) ఆయన కాత్మీయులే, వారందరికీ జీవన ప్రదాత ఆయనే. వారిలో భావంలో బాహ్యంలో స్థిరంగా నెలకొన్నవాడా ఈశ్వరుడే. |
అనంతరూపః అనంతశ్రీః జితమన్యుః భయాపహః |
హద్దులేకుండా వ్యాపించిన రూపమది. దానికి భంగంలేదు. దాని నాశ్రయించి ఉన్న శక్తికి (శ్రీ) కూడా నాశం లేదు. ఆ రెండింటి కలయికే ఈ సృష్టి. కాబట్టి ఈ జీవకోటి మీద (మన్యు) ఆగ్రహ మెప్పుడూ లేదు. లేకపోగా వీరి భయాన్ని నిర్మూలించేది అదే. |
చతురశ్రః గభీరాత్మా విదిశః వ్యాదిశః దిశః |
శక్తి గలదది కనుక నలువైపులా పదునుగలది. లోతుకు దిగే కొద్దీ లోతైన స్వరూపమది. అంతుచిక్కదు. చిక్కకుండా ఎక్కడో దాగి ఉన్నదా అంటే అలా కాదు. దిశలూ, విదిశలూ అన్ని వైపులా అదే. అన్నీ కూడా అదే. అంతేకాదు - అన్నీ తానే అయి మరలా అన్నింటినీ ఆదేశిస్తుంటుంది. |
అనాదిః భూః భువః లక్ష్మిః |
ఆది (కారణం) లేనిదది. కారణం లేకుండానే కార్యరూపంగా (భూః) జన్మిస్తున్నది. జన్మించటమే కాక చరాచరాలన్నింటినీ (భువః) జన్మింపజేస్తున్నది. చేసి వీటినే లక్షణంగా చేసుకొని తన తత్త్వాన్ని లక్షించండని చెబుతున్నది. |
సువీరః రుచిరాంగదః |
ఎవడైనా ఈ లక్షణాన్ని బట్టి ఆ లక్ష్యాన్ని గుర్తిస్తే అలాంటి గొప్ప వీరుడికి ఉజ్జ్వలమైన (రుచిర) జ్ఞానమనే (అంగ) విగ్రహాన్ని (ద) ప్రసాదిస్తుంది. ప్రజ్ఞాన స్వరూపుడవుతాడీ సాధకుడని భావం. |
Page 63