నామం | అంతరార్థము |
---|---|
ఆత్మవాన్ | అసలీ పనికూడా ఆయన స్వరూపమే. మనమేమిటి. మన పనులేమిటి, అనాత్మ ఎక్కడ ఉంది. అంతా ఆత్మదే-ఆత్మే. |
సురేశః శరణమ్ శర్మ |
మన మానవులేమిటి - సురలు స్వయం ప్రభువులమని విఱ్ఱవీగే దేవతలకు కూడా ఈశ్వరుడాయన. దేవ మానవ దానవులందరికీ శరణ్యుడు, వారందరి అనుభవానికీ వచ్చే శర్మ-సుఖ స్వరూపుడు. |
విశ్వరేతాః ప్రజాభవః |
అచేతనమైన ఈ విశ్వానికంతా రేతస్సు-బీజస్వరూపుడు, పోతే చేతనమైన ప్రజా కోటికంతా భవ-జన్మకారకుడు. చేతనా చేతనాలు రెండింటికీ ఉపాదానమూ నిమిత్తమూ రెండూ పరమాత్మే. |
అహః సంవత్సరః వ్యాళః |
అహస్సులాగా ప్రకాశిస్తూనే ఉంటాడెప్పుడూ, అంటే నామ రూపాత్మకంగా గోచరిస్తూనే ఉన్నాడు. సంవత్+సర-నిత్యమూ కదులుతూ మెదులుతూనే ఉన్నాడు జీవరూపంగా. అయినా వ్యాళ అంటే శఠుడు. గూఢ విప్రియకృత్ శఠః అన్నారు. మన కనులు కప్పి తప్పించుకొని పోతుంటాడు. |
ప్రత్యయః సర్వదర్శనః |
ప్రతి+అయ మరలా వెనుకకు తిరిగి ప్రత్యగ్దృష్టితో చూడగలిగితే ప్రతి+అయ - మన దృష్టికే ఎదురుపడతాడు. అప్పుడీ సర్వ ప్రపంచమూ దృశ్యంగా కాదు- దర్శనంగానే భాసిస్తుంది. |
అజః సర్వేశ్వరః సిద్ధః |
అలాంటి దర్శనంతో ఆయనలాగా మనమూ అజులమే. జన్మించామని గాని జన్మించబోతామని గాని భావమే ఉండ బోదు. సర్వమూ కనిపిస్తున్నా దానికి బద్ధులం కాము. ఈశ్వరులమే. ఒక్క మాటలో చెబితే సిద్ధులం. |
Page 15