#


Index

  అయితే అది మాత్రం ఒంటరిగా ఎలా ఉండగలదని ప్రశ్న. దానికే స్వతస్సిద్ధ భావాత్తని మరొక హేతువును ప్రతిపాదిస్తున్నారాచార్యులవారు. స్వతస్సిద్ధభావమంటే మరొకదాని అపేక్ష లేకుండా తనపాటికి తానే ఉండటం. చైతన్యం గనుకనే అది తనపాటికి తానుండగలదు. నేనున్నానని అనుకోటమే గదా చైతన్యలక్షణం. దానికీ మిగతా అనాత్మ జగత్తుకూ సాజాత్యమే లేదు. మిగతా లౌకికమైన పదార్థమేదైనా తీసుకోండి. దానిపాటికది ఉండలేదు. ప్రత్యక్షమో, అనుమానమో, ఏదో ఒక ప్రమాణానికి గురి అయినప్పుడే దానికి ఉనికి. ప్రమాణానికది విషయం కాకుండానే ఉందని చెప్పటం అర్థంలేని మాట. అసంభవంకూడా "ప్రమాణ ప్రవృత్త్య ప్రవృత్తి పూర్వకౌ సంభావా-సంభవౌ న సంభవాసంభవపూర్వికే ప్రమాణ ప్రవృత్త్య ప్రవృత్తీ” అని ఆచార్యులవారే ఒకచోట సెలవిచ్చారు. చక్షురాదీంద్రియాలకు గోచరమయి నప్పుడే ఇది ఘటమనీ, ఇది పటమనీ వ్యవహరిస్తున్నాము గాని ఇంద్రియ విషయం కాకుండానే వ్యవహరించలేము. అంటే ఏ పదార్ధానికైనా ప్రమేయంగానే సిద్ధిగానీ పదార్ధంగా సిద్ధిలేదు. కనుకనే అవి స్వతస్సిద్ధంకావు. పోతే ఈ ఆత్మ చైతన్యమొక్కటే స్వతస్సిద్ధం. ఎందుకంటే వాటిలాగా ఇది ఏ ప్రమాణానికీ ప్రమేయం కాదు. ప్రమాణాలన్నిటికి ముందే సిద్ధమయి ఉన్నదది. కనుకనే దానిని అప్రమేయమని పేర్కొన్నారు వేదాంతులు. ఇలాంటి అప్రమేయం గనుకనే అది స్వతస్సిద్ధం.

  అయితే స్వతసిద్ధమైనా మరొకదాని ఆశ్రయంకూడ దానికుండవచ్చు గదా. లోకంలో ఒక చక్రవర్తి ఉన్నాడంటే వాడు స్వతంత్రుడైనా ఒక మంత్రి అనీ, సామంతులనీ, ప్రజలనీ, రాజ్యమనీ, పాలనమనీ ఉండటంలేదా. అలాగే ఆత్మకూడ ఉండవచ్చు గదా అంటే అలాకూడా ఉండదని నిషేధిస్తున్నారు. 'అనన్యాశ్రయత్వాత్' అన్యాశ్రయం కానిదేదో అది అనన్యాశ్రయం. అన్యమనేదే లేదు ఆత్మకు. అంతా ఆత్మస్వరూపమేనని నిరూపించాము ఇక అన్యమెక్కడిది. అన్యమే లేకపోతే దానినిది ఆశ్రయించటమేముంది. మీదు మిక్కిలి అన్యమే దీనినాశ్రయించి బ్రతుకుతున్నది. ఏమిటా అన్యం జగత్తూ జీవుడు, అన్యమే లేదన్నారు గదా మరలా ఈ జీవజగత్తు లెక్కడివి ? లేవు వాస్తవానికి. కాని వాస్తవాన్ని గమనించిన నాథుడెవడు. నూటికి తొంభైమంది అవిద్యాసాగరంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. అవిద్యా తిమిరాంధులమైన మనదృష్టికావాస్తవమైన ఆత్మ తత్త్వం కనిపించడంలేదు.

Page 43