#


Index

  దీప జాతి వేరు. అది పృధివీ తత్త్వమైతే ఇది తేజస్తత్వం. రెంటికీ సంబంధమే లేదు. ఘటంలో ఉన్నా ఘటం వెలపల ఉన్నా దీపం దీపమే. ఘటం మీద ఆధారపడిలేదది. దానిపాటికదే ఉన్నది. మహా అయితే ఘటంలో తాత్కాలికంగా వచ్చి ప్రవేశించింది. ఘటమనేది దానికొక ఉపాధి. ఇది దాన్ని బంధించటం లేదు. మీదు మిక్కిలి దాని వెలుగులో ఘటమూ దీని రంధ్రాలూ చుట్టూ ఉన్న పదార్థాలూ అన్నీ ప్రకాశిస్తున్నాయి. దీపం ప్రకాశకం ఘటాదులు ప్రకాశ్యం. ప్రకాశ్య ప్రకాశక సంబంధం తప్ప మరే సంబంధమూ లేదు వాటికి. అసలు దీప ప్రకాశమే లేకపోతే ఇవి ప్రకాశించటానికే నోచుకోలేవు. తమ ప్రకాశాని కవి దీపం మీద ఆధారపడవలసిందే. దీపం మాత్రం వీటిమీద ఆధారపడనక్కరలేదు. ఇవి లేకపోయినా తన పాటికి తానది స్వయంగా ప్రకాశించగలదు. తాను ప్రకాశిస్తూ వీటిని ప్రకాశింప జేసే పదార్థమిది.

  అలాగే ప్రస్తుత మీ ఆత్మ చైతన్యం కూడా ఒక దీపం లాగానే ఈ శరీరమనే ఘటంలో వచ్చి చేరింది. చేరలేదు వాస్తవంలో అద్దంలో నీడలాగా చేరినట్టు భాసిస్తున్నది. అది తన పాటికి తాను స్వయంగా ప్రకాశిస్తూ చక్షురాది కరణ ద్వారా బహిః స్పందతే చక్షురాదులైన ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరిస్తున్నది. ఘటానికున్న రంధ్రాల లాంటివీ ఇంద్రియాలు. వీటి ద్వారా బయటికి వచ్చి అది ఈ చుట్టూ కనిపించే ప్రపంచాన్ని కూడా ప్రకాశింప జేస్తున్నది. అలా చేయకుంటే ఈ చరాచర ప్రపంచం మనకిలా కనిపించేదే కాదు. జగత్తు మాట దేవుడెరుగు. అసలు మన దేహేంద్రియాదులే మనకు గోచరం కానేరవు.

Page 43