అది స్వామి మనసులో బాగా నాటుకొని మీరు దీనినంతటినీ కాగితంమీద వ్రాసి పంపితే సంతోషిస్తానని సెలవిచ్చారు. అది నాకూ సంతోషమేనని చెప్పి భాగ్యనగరానికి మరలి రాగానే అక్కడ ఉదయం సాయంత్రం ప్రవచన కార్యక్రమమున్నా అదే పనిగా కూచొని వ్రాయసాగాను. వ్రాసినకొద్దీ అది రబ్బరులాగా సాగి రెండు పేజీలనుకొన్నది పన్నెండు పేజీలకు పెరిగింది.
దానికొక శుద్ధ ప్రతి తయారుచేసి ఆయనకు పంపుదామని చూస్తుండగా మా శిష్యులు కొందరు దీన్ని అచ్చు వేయించి పంచిపెడితే జిజ్ఞాసువులందరికీ ఉపకరిస్తుంది గదా అని సలహా ఇచ్చారు. అదీ ఒక విధంగా మంచిదే ఉభయ తారకంగా ఉంటుందనిపించింది నా మనసుకు. ఇదిగో వారి ప్రోత్సాహ ఫలమూ నా ప్రయత్నఫలమే ఇప్పుడీ రూపంలో కనపడుతున్న ఈ చిన్ని గ్రంథం. దీని గంధం తనివితీర ఆఘ్రాణిస్తే రూపరహితమైన తురీయస్థితిని సాధకుడందుకోగలడనటంలో సందేహం లేదని నా అభిప్రాయం. ఉందో లేదో తేల్చుకోవలసింది మీ అనుభవం. కాకపోయినా ఎక్కడో ఉందా తురీయమనుకొంటేనే నీ నా అనే మాట. ఎక్కడ బడితే అక్కడే తురీయమని చూచినప్పుడిక నీ నా అభిప్రాయమనే మాట కర్థమేముంది. అందరిదీ కలిసి ఒకే ఒక అభిప్రాయం. ఒకే ఒక అనుభవం. స్వామీజీ అనుభవమదే నా అనుభవమదే మీ అనుభవమూ అదే. అఖండానుభవం.
పూర్ణానుభవం.
భవదీయ:
Page 4