#


Index

ప్రస్థానత్రయ సారము

తైత్తిరీయోపనిషత్తు

  పోతే ఇంతకు ముందుగానే చెప్పామొక మాట. జగత్తుది సృష్టి అని జీవుడిది సృష్టి గాదు ప్రవేశమని. పరమాత్మే జీవరూపంగా వచ్చిశరీరంలో ప్రవేశించాడట. ప్రవేశించి ఈ ఉపాధులతో చేయి కలిపి తన స్వరూపమే తాను మరచిపోయాడు. మరచిపోతేనే వాడు జీవుడు. ఇదే సంసార బంధం. విషాదం. మరలా తన పొరబాటు తాను గుర్తించి తన నిజస్వరూపం వెతుకుతూ పోయి ఈ బంధం వదలించుకోటమే సాయుజ్యమీ జీవుడికి. అది ఎలాగో వర్ణించటానికి వచ్చాయి రెండు పనిషత్తులు. మొదటిది తైత్తిరీయం. రెండవది ఐతరేయం. అందులో తైత్తిరీయం జీవుడి రాకపోకలెలా వర్ణిస్తున్నదో చూతాము.

  తస్మా దేతస్మా దాత్మన ఆకాశః అని ప్రారంభం. ఆత్మ నుంచి ఆకాశం. దాని నుంచి వాయువు. వాయువు నుంచి తేజస్సు. ఇలా వరసగా వచ్చి మానవ శరీరంలో బుద్ధి అనే గుహలో చేరిపోయిందట అది. బాహ్యంగా ఆకాశాది పంచభూతాలైతే -ఆంతర్యంగా పంచకోశాలు. కోశమంటే ఒక Sheath or Cover. అవి మన శరీరంలోనే ఉన్నాయి. పై నుంచి చూస్తే ఆనందమయ కోశం ఆకాశానికి సరిపోతుంది.

Page 20

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు