#


Index

చిత్రతరంగిణి

రంగ భూమిక

  చిత్ర తరంగిణి అని ఈ పుస్తకం పేరు. పేరు చూచి ఇవేవో సినిమా పాటలయి ఉంటాయని భ్రాంతి పడవచ్చు మీరు. చిత్రమంటే సినిమా కాదు. అనేక విధములైన భావాలని అర్థం. కల్హణుడి రాజ తరంగిణి - నారాయణ తీర్థుల కృష్ణలీలా తరంగిణి - నాకు స్ఫూర్తి నిస్తే చేసిన నామ కరణమిది. నా మనసులో ఉదయించిన నానావిధ భావ తరంగాలన్నీ ఒకచోట పోగుచేసి చూపుతున్నా నంత మాత్రమే.

  ఇందులో ధర్మానికీ నీతికీ - సమాజానికీ సాహిత్యానికీ - సంగీతాది కళలకూ - మతానికీ మానవాభ్యుదయానికీ - ఒకటేమిటి. ఎన్నో జీవితశాఖలకు సంబంధించిన విషయాలున్నాయి. ఇవన్నీ ఒకసారి కూచొని వ్రాసినవి కావు. ఒకచోట కూచొని వ్రాసినవీ కావు. దాదాపు నలభయి సంవత్సరాల నుంచీ నిన్న మొన్నటి దాకా ఉంటుంది వీటికి వయసు. నా కోసం కొన్ని అయితే ఇతరులడిగితే వారికోసం వ్రాసి ఇచ్చినవి కొన్ని. సంస్కృతంలో ఉన్నాయి. తెలుగులో ఉన్నాయి. గద్యపద్యాలలో కూడా పొందుపడి ఉన్నాయి.

  ముద్రితాముద్రిత రూపంలో విడివిడి కాగితాల మీద బ్రతుకుతున్న ఇవన్నీ ఇంకా వెలుగు చూడకపోతే పూర్తిగా మాసిపోయే ప్రమాదముంది. వెంటనే వీటిని ముద్రించి బయట పెట్టండని మా శిష్యులూ, మిత్రులూ కొందరు సలహా ఇచ్చారు. వారి సలహా మేర కిపుడీ గ్రంథరూపంలో దీని నభిజ్ఞ లోకాని కందజేయడమయింది.

  ఇందులో అన్నిరకాల పాఠకులకూ పనికి వచ్చే అంశాలూ చోటు చేసుకొన్నాయి. కాబట్టి ఎవరి అభిరుచికి తగిన అంశాలు వారు చదువుకొని ఆనందించవచ్చు. అంతేకాదు. అన్ని అంశాలలోనూ పూసలలో దారంలాగా ఒక తాత్త్వికమైన విచార ధార ప్రసరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆమూలాగ్ర మన్ని విషయాలూ తడవి చూచినా తప్పు లేదు. ఇంకా గొప్ప ఫలమే చవిచూడగలరు. ఇక సెలవు. ఇతి భవదీయః శ్రీనివాస రాయః

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు